మేలో 72వ మిస్ వరల్డ్ పోటీలు
పర్యాటక ప్రాంతాల ప్రమోషన్ కోసం సర్కారు అడుగులు
అక్షరటుడే, హైదరాబాద్: విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా త్వరలో 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఈ పోటీలు 28 రోజుల పాటు అట్టహాసంగా జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో మే 4న మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ వేడుకలు ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. మే 31న గ్రాండ్ ఫినాలె ఉంటుంది. మిస్ వరల్డ్ – 2025 థీమ్ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’.
ఫస్ట్ మిస్ వరల్డ్
ఇంగ్లండ్ లో జులై 29, 1951న ఫస్ట్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 26 మంది మాత్రమే పాల్గొన్నారు. స్వీడన్ బ్యూటీ ‘కికి హకాన్సన్(22)’ టైటిల్ సొంతం చేసుకొంది. ఎరిక్ మోర్లీ ఈ వేడుకలను నిర్వహించింది. మొదట ‘ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్’ అని ఈ పోటీలను పిలిచారు. ఆ తర్వాత ‘మిస్ వరల్డ్’ అని పేరు మార్చి, ఏటా నిర్వహిస్తున్నారు. 1952లో అందాల కిరీటాన్ని స్వీడన్ మోడల్ రాణి మే లూయిస్ ఫ్లోడిన్ గెలుచుకుంది.
మిస్ వరల్డ్ ఎందుకు?
మిస్ వరల్డ్ పోటీలను కేవలం అందాల ప్రదర్శన కోసమే కాకుండా.. అంతర్లీనంగా సామాజిక అంశాన్ని జోడిస్తారు. ముఖ్యంగా మహిళా సాధికారత అంశంగా భావిస్తారు. అతివల్లోని ప్రతిభ, నైపుణ్యాలు, దాతృత్వ గుణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎవరు నిర్వహిస్తారు…?
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ పోటీలు నిర్వహిస్తుంది. దీని ఛైర్ పర్సన్ జూలియా ఎవెలిన్ మోర్లీ. ఈమె ఒక ఆంగ్ల వ్యాపారవేత్త, మాజీ మోడల్, మిస్ వరల్డ్ పోటీల సృష్టికర్త.
పోటీల్లో పాల్గొనేవారి అర్హతలు..
- వయసు: 17-26 సంవత్సరాలు
- వివాహ స్థితి: పెళ్లికాని అమ్మాయి
- భాష: దేశ భాష / ఇంగ్లిష్
- విద్య: ఉన్నత పాఠశాల డిప్లొమా/తత్సమానం
- వ్యక్తిత్వం: కమ్యునికేషన్ స్కిల్స్
- అందం: శారీరక ఆకర్షణ, విశ్వాసం
- దాతృత్వం: సామాజిక సేవలో నిబద్ధత
- ప్రతిభ: మ్యూజిక్, డ్యాన్స్, ప్రశ్నలకు సమాధానం చెప్పే నైపుణ్యం
- అవగాహన: విభిన్న సంస్కృతుల పట్ల అవగాహన
- ఆత్మవిశ్వాసం: సొంతంగా ఆలోచించే, ఎదిగే సామర్థ్యం
మిస్ వరల్డ్ టైటిల్ ను భారత్ సొంతం చేసుకున్న సందర్భాలు
- రీటా ఫారియా(1966)
- ఐశ్వర్య రాయ్(1994)
- డయానా హెడెన్(1997)
- యుక్తాముఖి(1999)
- ప్రియాంక చోప్రా(2000)
- మానుషి చిల్లర్(2017)
భారత్ లో పోటీల నిర్వహణ
- బెంగళూరు(1996)
- ముంబయి(2000)
- ముంబయి(2009)
- ముంబయి(2024)
విజేతకు దక్కేవి..
- మిస్ వరల్డ్ కిరీటం
- నగదు బహుమతి($1 మిలియన్)
- మోడలింగ్ అవకాశాలు
- బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా సేవా కార్యక్రమాలకు మద్దతు
- ఏడాది పాటు సీడ్ ఫండింగ్
- లండన్ లో విలాసవంతమైన వసతి
- ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు…
హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదిక మీద చాటాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రపంచం ఎదుట ఆవిష్కరించేందుకు, రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ పోటీల్లో 140 దేశాల సుందరీమణులు, వివిధ దేశాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. పోటీలు ఉన్న సమయాల్లో మినహా మిగతా రోజుల్లో వారిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించేందుకు సర్కారు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, యాదగిరిగుట్ట క్షేత్రం, రామప్ప ఆలయం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు తదితరాలను ఈ పోటీల ద్వారా ప్రమోట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
- పోచంపల్లి చీరలు, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల ప్రాంతాల్లోని వస్త్రాలను నేసేవారిని అందాల పోటీల్లో పాల్గొనే వారికి వివరించడం.
- రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను పర్యాటకులకు చూపిస్తారు. రామప్ప ఆలయం, కాకతీయుల చరిత్ర, వేయి స్థంభాల గుడి, మేడారం సమ్మక్క-సారక్కల ప్రాశస్త్యం, లక్నవరం సరస్సు ప్రాంతాలకు తీసుకెళ్లారు.
- నాగార్జునసాగర్ బుద్ధవనం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం బౌద్ధ స్థూపాన్ని చూపిస్తారు.
- మెడికల్ టూరిజంలో భాగంగా ఆస్పత్రులు, వాటి ప్రత్యేకతల గురించి వివరించడం.
- వికారాబాద్ సహా రాష్ట్రంలోని ఎకో టూరిజం ప్రాంతాలకు తీసుకెళ్లి, వాటి ప్రత్యేకతలను వివరించడం.
- హైదరాబాద్‌లోని శిల్పారామంలో హస్తకళల ప్రదర్శన