అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ బాలికలకు ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. బాలికలు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని సూచించారు. అప్పుడే జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతారని పేర్కొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫ్‌డిఫెన్స్ అవగాహన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు చూస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ లాంటి సెల్ఫ్ డిఫెన్స్ విద్యల్లో శిక్షణ పొందాలన్నారు. ముందుగా లక్ష్యాలు ఏర్పరుచుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గత రెండు నెలలుగా తైక్వాండోలో శిక్షణ పొందిన ప్రభుత్వ పాఠశాలల బాలికలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్ కమిషనర్ మకరందు, ట్రెయినీ ఐపీఎస్ చైతన్య, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజేందర్, కోచ్ మనోజ్ పాల్గొని ప్రసంగించారు.