అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెజ్జోరా శివారులోని కప్పల వాగు నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు కొద్ది రోజులుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా.. బీఆర్ఎస్ కార్యకర్త మహేందర్ అడ్డుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ అక్కడికి చేరుకుని మహేందర్ పై దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై సత్వరమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. కాగా.. దాడికి పాల్పడిన వ్యక్తి బాల్కొండ కాంగ్రెస్ ఇన్చార్జి సునీల్ రెడ్డి అనుచరుడిగా సమాచారం. ఆయన అండతోనే పలువురు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల కిందట ఓ కాంగ్రెస్ నాయకుడు ఇదే తరహాలో అక్రమ మైనింగ్ చేశాడు. అడ్డుకున్న స్థానికులు, విలేకరులను బెదిరించగా.. భీమ్‌గల్ పోలీసులు అతడిని బైండోవర్ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మైనింగ్ శాఖ నుంచి ఆదాయం సమకూర్చుకునే పనుల్లో ఉండగా.. ఇక్కడ మాత్రం అధికార కాంగ్రెస్ నేతలు అక్రమార్కులను ప్రోత్సహించడం వివాదాస్పదం అవుతోంది. తాజా దాడి ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!