అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విధిలేక విద్యార్థులకు భోజనశాల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు ‘మన ఊరు – మనబడి’ కింద రూ.72లక్షలు మంజూరవడంతో సుమారు రెండేళ్ల కిందట అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టారు. కానీ కొన్నిరోజులకే పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా.. గదుల కొరత కారణంగా భోజనశాలలో తరగతులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ఇబ్బందులను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.