అక్షరటుడే, వెబ్‌డెస్క్: భైంసా పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం ఒకే రోజు ఇద్దరు మహిళల మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించారు. ఓ మహిళ తప్పించుకోగా, మరో మహిళ నుంచి సగం గొలుసు ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని మేదరిగల్లిలో రాణి అనే మహిళ బీడీ కంపెనీకి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో నుంచి చైన్ లాగారు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో తప్పించుకుంది. దీంతో దొంగలు పారిపోయారు. కొద్ది క్షణాల వ్యవధిలో కమల థియేటర్ సమీపంలో రజిత అనే మరో మహిళ మెడలో చైన్ లాగగా, ఆమె అప్రమత్తం కావడంతో చైన్‌లో కొద్ది భాగం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.