అక్షరటుడే, కామారెడ్డి: జహీరాబాద్ ఎంపీగా ఎన్నికై మొట్టమొదటిసారి అధికారికంగా నిర్వహించిన దిశ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొనగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి మినహా జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీకాంత రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. గత నెల 20న జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఈ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అప్పట్లో ఎమ్మెల్యేల డుమ్మా అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొద్ది కాలంగా షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావు మధ్య విబేధాలు ఉండగా..బాన్సువాడలో పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అలాగే జుక్కల్ లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న వివాదాలు ఎటువైపు వెళ్తాయోనని కిందిస్థాయి క్యాడర్ చర్చించుకుంటోంది.