అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక జాబితా విడుదల చేసింది. మొదటి నుంచి జీవన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. కానీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు కాకుండా బీసీ వర్గం వారికి టికెట్ ఇస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. పార్లమెంట్ పరిధిలోని నేతలు, పీసీసీ ఏకాభిప్రాయం నిర్ణయం మేరకు ఎట్టకేలకు జీవన్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి పోటీలో ఉండనున్నారు. వీరిద్దరూ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు. చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇద్దరు బీసీ అభ్యర్థులను దాటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బీసీలను తనవైపు ఎలా తిప్పుకుంటారో వేచిచూడాల్సిందే.!