అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని శుక్రవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బకాయిల కోసం ఉద్యోగులు, పోలీసులు రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించాలన్నారు. న్యాయంగా పని చేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రావడం లేదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకే ఏమి చేయలేని సీఎం ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతు పండుగ పేరుతో రైతులను, యువ వికాసం అంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతానని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు కలపని పాలతో అభిషేకం చేస్తానని వ్యాఖ్యానించారు.