అక్షరటుడే, వెబ్ డెస్క్: జీవో నం.317తో బాధితులుగా మారిన సుమారు 15వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు గత మూడేళ్లుగా తిప్పలు తప్పడం లేదు. గత భారాస సర్కారు తీసుకొచ్చిన జీవో నం.317తో స్థానికతను కోల్పోయి.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి తలెత్తింది. వీరిలో అనేకమంది ఇప్పటికే అనారోగ్యం బారినపడ్డారు. విధులు నిర్వహించేందుకు వెళ్తూ ప్రమాదాలకు గురయ్యారు. వీరిలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ ఈ జీవో బాధితులకు భంగపాటు తప్పడం లేదు.

నాడు వర్క్ టు ఆర్డర్ పేరుతో..

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిపాలన సౌలభ్యం కోసం గత భారాస సర్కారు 10 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 33కు పెంచింది. 2016 అక్టోబరులో 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తర్వాత 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఆ వెంటనే వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు ఉద్యోగులను పంపించారు. మూడు నెలల తర్వాత శాశ్వత కేటాయింపులు ఉంటాయని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత వీరిని పట్టించుకోలేదు.

కొత్త జోన్ల ఏర్పాటు..

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని మొత్తం పది జిల్లాలు కూడా జోన్-5, జోన్-6 కింద ఉండేవి. 2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపుల కోసం సర్కారు కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది. మొత్తం 33 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌వ్యవస్థీకరించింది. దీనిని 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

317 జీవో జారీ..

కొత్త జోన్లకు ఉద్యోగుల సర్దుబాటు కోసం డిసెంబరు 6, 2021న ప్రభుత్వం 317 జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో ఉన్న ఉద్యోగులు.. వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జోన్లలో వారు కోరుకున్న చోటుకు వెళ్లమంది. అయితే ఇక్కడే ఒక తిరకాసు పెట్టింది. అదే కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవడం. దీనివల్ల డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోయి సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆ ఆప్షన్ లభించలేదు. ఫలితంగా సీనియార్టీ తక్కువగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సొంత జిల్లా, ప్రాంతాన్ని వీడి.. వేరే చోటుకు శాశ్వతంగా పోస్టింగ్ మీద వెళ్లాల్సి వచ్చింది.

వెసులుబాటులో అక్రమాలు..

317 జీఓ మార్గదర్శకాల్లో వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి మాత్రం బదిలీ నుంచి నుంచి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ వెసులుబాటు పేరుతో నాడు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు బదిలీ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ప్రచారం జరిగింది. దీనివల్ల మరింత మంది 317 జీవో బాధితులు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా.. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు సర్కారు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో మిన్న కుండిపోయినట్లు సమాచారం.

న్యాయం చేయమని కోరితే..

317 జీవోతో స్థానికత కోల్పోయి, కుటుంబం చిన్నాభిన్నం అయిన బాధిత ఉద్యోగులు.. తమకు న్యాయం చేయమని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు కోరినా కనికరించలేదు. పైపెచ్చు గొంతెత్తిన వారిపై ఉక్కుపాదం మోపింది. ఉద్యోగ సంఘ నాయకుల్లో కొందరిని ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడంతో.. బాధితుల పక్షాన గొంతుక వినిపించే వారే లేకుండా పోయారు.

గతేడాది రేవంత్ రెడ్డి హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గతేడాది అక్టోబరు 2న గాంధీభవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ’48 గంటలలో 317 జీవో సమస్యను పరిష్కరిస్తా’ అని చెప్పడంతో బాధితులు సంబరపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది పాలన పూర్తి చేసుకొని తాజాగా వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నారు. కానీ 317 జీవో బాధితుల బతుకులు మాత్రం ఏమాత్రం మారలేదు.

గత సర్కారు ఆనవాళ్లు తుడిచేస్తూ..

కాంగ్రెస్ ప్రభుత్వం.. గత సర్కారు ఆనవాళ్లను మెల్లిమెల్లిగా తుడిచేస్తూ పోతోంది. సచివాలయంలో మార్పులు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసింది. ప్రజాప్రతినిధులకు కొత్త బండ్లు కేటాయించింది. టీఎస్ స్థానంలో టీజీ తెచ్చారు. ఇలా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తూ చేపట్టే ఇలాంటి పనులతో సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు. కానీ 317 జీవో బాధితులపై దృష్టి పెడితే.. చీకటి బతుకుల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. ఇలాంటి చీకటి జీవోలను రద్దు చేయడం ద్వారా గత సర్కారు చేసిన తప్పిదాలను సరిదిద్దడంపై దృష్టి పెడితే బాగుంటుందని బాధితులు విన్నవిస్తున్నారు.

స్థానికత కోల్పోవడమే ప్రధాన సమస్య

ఉద్యోగ, ఉపాధ్యాయులకు విధి నిర్వహణలో బదిలీలు సహజం. బదిలీపై ఎక్కడికి వెళ్ళినా.. కొన్ని సంవత్సరాలకు తిరిగి సొంత ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 317 జీవోతో స్థానికత కోల్పోయిన వారు ఎన్ని సంవత్సరాలు అయినా తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇదే ఉద్యోగుల మానసిక క్షోభకు ప్రధాన కారణం.

వారి బాధలు వర్ణనాతీతం

317 జీవోతో బదిలీ అయిన వారిలో చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాన్ని వదిలి ఉండలేక.. నిత్యం సొంత ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన చోటుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా నిత్యం సుమారు 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వారున్నారు. ముఖ్యంగా వీరిలో అనేకమంది మహిళలు ఉన్నారు. వీరు నిత్యం ఐదారు గంటలు ప్రయాణంలోనే గడపాల్సిన దుస్థితి. సమయానికి తిండి ఉండదు. ఉదయం లేవగానే హడావిడిగా విధులకు బయలుదేరడం, చీకటిపడ్డాక ఇంటికి చేరుకోవడం నిత్యకృత్యం. ఎక్కడ టాయిలెట్ సమస్య వస్తుందోనని దాహమేసినా.. నీళ్లు తాగరు. తిండి తినరు. ఇలా అనేకమంది ఇప్పటికే జబ్బుల బారిన పడ్డారు. నిత్యం ప్రయాణం చేస్తుండటంతో ఆర్థో, న్యూరో సమస్యలతో సతమతమవుతున్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి

– రత్నమాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 317 జీవో డిస్లోకేటెడ్ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం

కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటు కొరకు వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ఉద్యోగులకు ఈ సర్కారు కూడా మొండి చేయి చూపించడంతో 317 బాధిత ఉద్యోగులలో నమ్మకం సన్నగిల్లుతోంది. ఇప్పటికైనా గత ప్రభుత్వ విధానాలు పాటించకుండా.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నిజమైన బాధిత డిస్లోకేటెడ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి.