అక్షరటుడే, వెబ్ డెస్క్: బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్(34) సూసైడ్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 9న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబ వేధింపులు, దోపిడీయే కారణమంటూ 24 పేజీల నోట్, వీడియోను విడుదల చేశాడు. తనపై నికితా, ఆమె కుటుంబం గృహ హింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నంతో సహా పలు తప్పుడు కేసులు పెట్టిందని అతుల్ పేర్కొన్నాడు. వారు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని, తన కొడుకు వద్దకు అనుమతి నిరాకరించారని, తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. చట్టపరమైన వివాదాలను పరిష్కరించేందుకు రూ.3కోట్లు, నాలుగేళ్ల కుమారుడి సందర్శన హక్కుల కోసం రూ.30లక్షలు, తన కుమారుడి ఖర్చుల కోసం నెలవారీ రూ.2లక్షలు చెల్లించినప్పటికీ, తన కొడుకుతో కలవనీయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
నా అభ్యర్థనలు పట్టించుకోలేదు..
ఉత్తరప్రదేశ్లోని ఫ్యామిలీ కోర్టులో ఒక న్యాయమూర్తి తన అభ్యర్థనలను పట్టించుకోకుండా నికితా వైపు మొగ్గు చూపారని ఆరోపించారు. ఒక కోర్టు అధికారి బహిరంగంగా లంచాలు స్వీకరించడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నాడు. తన కొడుకును తన తల్లిదండ్రుల వద్దకు పంపించాలని అభ్యర్థించాడు. అంతేకాకుండా.. న్యాయం జరిగే వరకు తన అస్థికలను నిమజ్జనం చేయకుండా భద్రపరిచి ఉంచమని సూసైడ్ నోట్ లో కోరాడు.