అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 12 సీట్లు గెలుస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 సీట్లు గెలుపొందడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అటు పశ్చిమబెంగాల్, ఇటు దక్షిణ భారతంలో తమకు అనుకూలంగా ఓట్లు పడతాయన్నారు. మోదీ అభివృద్ధి నినాదమే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే రాహుల్ గాంధీ కుటుంబం, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడతాయన్నారు. అదే బీజేపీకి ఓటేస్తే దేశం బాగుపడుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. అభివృద్ధిని మరిచి దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి టాక్స్ మొదలైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను తమ పార్టీ ఫండ్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. మోదీ చెప్పినట్టుగా 370కి పైగా సీట్లు కచ్చితంగా గెలుస్తామన్నారు. తమ పార్టీకి ఒక విజన్ ఉందని, కాంగ్రెస్ మాత్రం కేవలం మోదీని ఓడించడమే విజన్‌గా పెట్టుకుందన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పోతనకర్ లక్ష్మీనారాయణ, ప్రబారి వెంకటరమణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.