అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉద్యోగులు పదవీ విరమణ పొందినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోలేని దుస్థితి నెలకొంది. రెండు, మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవిత చరమాంకంలోనూ మనశాంతి కరువైంది. ఏడాదికాలంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ కి సంబంధించిన రూ. 6 వేల కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా రిటైర్ అయిన సుమారు 2వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఏమిటీ ఈ పెన్షన్ గోల ?

బీకే భట్టాచార్య నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సిఫారసుతో 2004 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పెన్షన్ విధానం కింద రాష్ట్రంలో 2.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉద్యోగుల బేసిక్ పే, డీఏ మొత్తం నుంచి 10 శాతం మేర కోత విధించి ‘ప్రాణ్’ ఖాతాలో జమ చేస్తున్నారు. అంతే మొత్తాన్ని సర్కారు కూడా జమ చేయాల్సి ఉంటుంది. అయితే గతేడాది సెప్టెంబరు నుంచి ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధిస్తున్నా.. ఆ నగదు మాత్రం ప్రాణ్ ఖాతాకు జమ కావడం లేదు. అటు సర్కారు వాటా కూడా విడుదల చేయడం లేదు. ఇలా ఇరువర్గాలకు సంబంధించిన రూ. 6 వేల కోట్ల నగదు ఏమైందో తెలియని దుస్థితి నెలకొంది. కాగా.. పంట రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నగదును దారి మళ్లించారనే అనుమానాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు.

అల్లాడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు..

40 సంవత్సరాల(సెప్టెంబరు 2004) తర్వాత ఉద్యోగం సాధించిన ఉద్యోగులు సుమారు 2వేల వరకు ఉండొచ్చు. గత మార్చి తర్వాత వీరంతా పదవీ విరమణ పొందారు. సాధారణంగా పదవీ విరమణ పొందగానే.. వారు చేసిన సేవలకు గుర్తుగా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ నగదును జమ చేయకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా ప్రతి ఫలాలు అందకుండా పోయాయి.

ఒక్కసారి బిల్లు చేస్తే..

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో అమ్మాయిల పెళ్లి కోసం కొందరు, ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి ఖర్చుల కోసం మరికొందరు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం సెప్టెంబరు, 2023 వరకు జమ అయిన నగదు వరకు బిల్లు చేసి ఆదుకొమ్మని వేడుకుంటున్నారు. కానీ దానికీ అవకాశం లేదు. ఎందుకంటే.. పెన్షన్, గ్రాట్యూటీకి సంబంధించి ఒక్కసారి బిల్లు చేస్తే మళ్లీ ఆ తర్వాత ఎప్పటికీ చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల వారు కోరిన విధంగా ఖజానా శాఖ అధికారులు చేయలేకపోతున్నారు.