అక్షరటుడే, బిచ్కుంద: మద్నూర్‌ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయాలు తిరిగి పంపిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు దాదాపుగా 52 వేల బస్తాల సోయాలు కొనుగోలు చేసి గోదాంలకు తరలించారు. వారం రోజుల తరువాత సోయాలు బాగులేవని 1,900 బస్తాలు వెనక్కి పంపారు. సోమవారం ఒక్కరోజే 547 బస్తాలు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే కొనుగోలు చేసి, తీరా వెనక్కి పంపడమేంటని వాపోతున్నారు. దీంతో తహసీల్దార్‌ ముజీబ్, సొసైటీ కార్యదర్శి బాబురావు రైతులను సముదాయించారు. ఆందోళన చెందవద్దని, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.