అక్షరటుడే, ఎల్లారెడ్డి: కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి(కేకేవై) రోడ్డు నిర్మాణం చేపట్టి ఎల్లారెడ్డి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న ఈ రోడ్డు కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల, కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి వద్ద ముగుస్తుందన్నారు. ఎన్‌హెచ్‌-563 జంక్షన్ నుంచి ప్రారంభమై సిరిసిల్ల వద్ద ఎన్‌హెచ్‌-365B క్రాస్ చేస్తూ కామారెడ్డి పట్టణ సమీపంలో ఎన్‌హెచ్‌-44 క్రాస్ చేసి ఎల్లారెడ్డిలోకి ప్రవేశిస్తుందన్నారు. ఎల్లారెడ్డి మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్‌-bని క్రాస్ చేసిన అనంతరం(బొగ్గు గుడిసె చౌరస్తా – మంజీర నది – నిజాంసాగర్ ప్రాజెక్టు) మీదుగా పిట్లం వద్ద NH-161తో కలిసిపోతుంది. ఈ రోడ్డు పనులు ప్రారంభమైతే అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సభను కోరారు.