ఎల్లారెడ్డి, అక్షరటుడే: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉండే యువకుడు బుధవారం ఉదయం తన ఇంటికి వచ్చిన బంధువును దేనికలాన్ రోడ్డులో గల వైన్ షాప్ కి తీసుకెళ్లి మద్యం తాగారు. అనంతరం ఇంటికి వెళ్తుండగా దేనికలాన్ చౌరస్తాలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను వదిలి పెట్టాలని వేడుకున్నా పోలీసులు వినకపోవడంతో.. యువకుడు స్టేషన్ ఆవరణలోని చెట్టుపైకి ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న మద్యం తాగి, కేకలు వేస్తూ కిందికి దూకాడు. అప్పటికే పోలీసులు అప్రమత్తమై జాలి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుండగానే కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసు వాహనంలో కామారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. సదరు యువకుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.