అక్షరటుడే, కామారెడ్డి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తమను రెగ్యులర్ చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. అమరవీరుల స్థూపం సాక్షిగా తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో పోలీస్ కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, శైలజ, సంతోష్ రెడ్డి, వనజ, మంగా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.