అక్షరటుడే, వెబ్ డెస్క్ : రాజకీయ వివాదాల్లోకి సినీ పరిశ్రమను లాగొద్దని దిల్ రాజు కోరారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం – సినీ ప్రముఖుల సమావేశం అనేది ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిందన్నారు. ఈ సమావేశంపై తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా తామందరం స్వాగతించినట్లు వివరించారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మనవి చేశారు.