అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇంటర్ మార్కులు, ర్యాంకులకు గతంలో ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ మార్కులపైనే ఆధారపడి సీట్లు కేటాయించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇంటర్ విద్య కేవలం ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు కావాల్సిన అర్హత కోసమే అన్నట్లుగా పరిస్థితి మారింది. దీంతో ఇంటర్‌లో ర్యాంకులు, మార్కులపై ఆసక్తి తగ్గింది. ఇందుకు అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. గతంలో ఇంటర్మీడియట్ మార్కులపైనే ఆధారపడి ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేవారు. ప్రతిష్ఠాత్మకమైన జాతీయ విద్యా సంస్థల్లో కూడా ఇంటర్ మార్కుల మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇచ్చేవారు. అయితే కొన్నేళ్లుగా ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాల కోసం రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించారు. దీంతో ఇంటర్‌లో సాధించిన మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కేవలం ‘దోస్త్’ ద్వారా జరిగే సామాన్య డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు మాత్రమే ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతే తప్ప రాష్ట్ర, జాతీయస్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్ లో ప్రవేశం పొందడానికి ఇంటర్ మార్కులు, ర్యాంకులకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
ధోరణి మారాలి..
ఇంటర్మీడియట్ విద్య అనేది ప్రస్తుతం పైచదువుల కోసమే తప్ప అధిక మార్కులు సాధించాలని, ర్యాంకులు కొల్లగొట్టాలన్న ధోరణి నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు బయటకురావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌లో ర్యాంకులు నిర్ణయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ప్రకటించి ప్రవేశాలను భర్తీ చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ఇంటర్ ర్యాంకులు, మార్కులకు ప్రాముఖ్యత తగ్గింది. అందుకే విద్యార్థులు ఐఐటీ, మెడికల్(నీట్), ఈఏపీసీఈటీలో రాణించాలంటే ఆ స్థాయిలో శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలో ప్రవేశం పొందితే తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయమే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆ దిశగా ప్రత్యేకించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారాలి. బుధవారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలు వెల్లడించనుంది. పిల్లల్లో మార్కులు, ర్యాంకుల ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ.. పిల్లలు సైతం తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీ అక్షరటుడే.