అక్షరటుడే, ఆర్మూర్: భీమ్‌గల్‌లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ యువకుడు విడుదల చేసిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఎస్సై తనను వేధిస్తున్నారంటూ నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి విడుదల చేశాడు. తనపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యం పోలీసులను ఇంటికి పంపుతున్నారని పేర్కొన్నాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. అలాగే హెచ్‌ఆర్సీ, ఉన్నతాధికారులు స్పందించాలని కోరాడు. అంతే కాకుండా మరో బాధితుడు సత్య గంగయ్య అనే వ్యక్తి ఓ కేసు విషయంలో సీఐ, ఎస్సై తన వద్ద డబ్బులు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. భీమ్‌గల్ పోలీసుల తీరు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.