అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇందూరు వేదికగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో అందరి మదిని దోచిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తెగ సందడి చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి కుటుంబ కథాచిత్రంగా నిలిచింది. థియేటర్లు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. మంచి ప్యామిలీ ఎంట్రటైనర్‌గా నిలిచి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. చాలా కాలం తర్వాత కడుపుబ్బా నవ్వించే మూవీ చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తొలి రోజు రూ.45 కోట్ల వసూళ్లు సాధించి కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది.

ఇటీవల కాలంలో సకుటుంబ సపరివారంగా చూడదగ్గ సినిమాలు రావడం లేదనే చెప్పాలి. ఓటీటీ అయినా, థియేటర్‌ అయినా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సినిమాలు చూడలేని పరిస్థితి ఉంటోంది. చాలా ఏళ్ల తర్వాత ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ ఆ లోటుని భర్తీ చేసిందని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు చెబుతున్నారు. పండుగ వేళ కుటుంబ సభ్యులతో కలిసి చక్కని వినోద భరిత సినిమా చూడగలిగామని ఇప్పటికే నెటిజన్లు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. నిర్మాత దిల్‌ రాజు తన సొంత జిల్లాలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించడం కలిసొచ్చిందంటూ ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా.. సక్సెట్‌ మీట్‌ను కూడా నిజామాబాద్‌లోనే నిర్వహిస్తామని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా దిల్ రాజు ప్రకటించారు. ఇందుకోసం ప్రేక్షకాభిమానులు ఎదురుచూస్తున్నారు.

కథ ఏమిటంటే..

ఇక కథ విషయానికి వస్తే.. పోలీస్‌ డిపార్ట్మెంట్‌లో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు(వెంకటేశ్‌) తన నిజాయితీ వల్లనే ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం(ఐశ్వర్య రాజేశ్‌)ని పెళ్లి చేసుకొని ఆమెతోనే సెటిల్‌ అవుతాడు. అయితే అమెరికా నుంచి తెలంగాణకి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్‌ టైకాన్‌ సత్య ఆకెళ్ల(శ్రీనివాస్‌ అవసరాల) వచ్చాక ఏం జరిగింది..? రాజు మళ్లీ ఎలా ఎంటర్‌ అయ్యాడు? డిపార్ట్మెంట్‌ ఆఫీసర్‌ మీనాక్షి(మీనాక్షి చౌదరి)తో సంబంధం ఏంటీ ? రాజు భార్య హంగామా.. అంతా తెరపై చూడాల్సిందే.