అక్షరటుడే, ఇందూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ.. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సంరంభానికి ప్రతి ఒక్కరికి వెళ్లాలని ఉంటుంది. అయితే జిల్లాకు చెందిన గోపి కుమార్ అందరికంటే ప్రత్యేకంగా వెళ్లాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిజామాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు పాదయాత్రగా వెళ్లాడు. కుంభమేళా కొనసాగే 45 రోజులపాటు అక్కడే ఉండి సేవ చేయనున్నాడు.

నిజామాబాద్ లోని ఇంద్రాపూర్ కి చెందిన లక్ష్మి, గంగాధర్ దంపతుల కుమారుడు గోపి కుమార్. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నాడు. టిఫిన్ సెంటర్ ను నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శివుడి భక్తుడైన గోపి నడుచుకుంటూ మహా కుంభమేళాకు వెళ్లాలని భావించాడు. కుటుంబ సభ్యులు మేనమామ ప్రోత్సాహంతో పాదయాత్ర ప్రారంభించాడు.

నిత్యం 60 కి.మీ నడక..

గోపి కుమార్ డిసెంబర్ 13న పాదయాత్ర ప్రారంభించాడు. ప్రతిరోజూ 50 నుంచి 60 కిలోమీటర్లు నడిచాడు. మొత్తం 22 రోజుల్లో ప్రయాగ్ రాజ్ చేరుకున్నాడు. అలాగే మధ్యలో అయోధ్య, కాశీ, చిత్రకూట్ ఆలయాలను దర్శించుకున్నాడు. నిజామాబాద్ నుంచి సుమారు 1100 కిలోమీటర్లు నడిచి, తన పాదయాత్రను జనవరి 3న పూర్తి చేశాడు.

45 రోజుల సేవ..

మహా కుంభమేళాకు పది రోజుల ముందే ప్రయాగ్ రాజ్ చేరుకున్నాడు. కుంభమేళా ప్రారంభమైన రోజు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం చూసి 45 రోజులపాటు సేవ చేయాలని భావించాడు. దీంతో అఖాడాలకు, ఆర్మీ అధికారులకు కేటాయించిన టెంట్లో ఉండడానికి అనుమతి పొందాడు. అక్కడే ఉంటూ అన్నదాన కార్యక్రమాలకు సాయం చేయడం, వచ్చే భక్తులకు సలహాలు సూచనలు ఇవ్వడం, నది వద్ద ప్రమాద హెచ్చరికలు చెబుతూ వాలంటీర్ గా కొనసాగుతున్నాడు.

దేవుడి అనుగ్రహం తోనే నడిచా..

-గోపి, నిజామాబాద్

భగవంతుడి అనుగ్రహంతో 1100 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. మధ్యలో ఎందరో కలిశారు. చాలామంది నాకు సాయం చేశారు. ముస్లింలు కూడా ఆహారాన్ని అందజేశారు. మహా కుంభమేళా ఒక అద్భుతం, చూడడానికి రెండు కళ్లు సరిపోవు. 45 రోజులపాటు ఇక్కడే ఉంటూ సేవ చేయాలని అనుకున్నాను.