ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్!

హైదరాబాద్, అక్షరటుడే: అడ్డగోలుగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు కాలం చెల్లబోతోంది. కార్పొరేట్ కళాశాలల్లో నిర్వహించే ఈ పరీక్షలు ఇంటర్ అధికారులకు కాసులు కురిపిస్తాయన్నది జగమెరిగిన సత్యం. విద్యార్థులకు ఇష్టారీతిన మార్కులు వేయడం అటుంచితే.. విద్యా సంస్థల నుంచి అధికారులు పెద్ద మొత్తంలోనే డబ్బులు లాగుతారనే అపవాదు లేకపోలేదు. వీరి అవినీతే ఆయా కళాశాలల యాజమాన్యాలకు వెసులుబాటుగా మారింది. లెక్కకు మించి వేసే ఈ మార్కులతో తాత్కాలికంగా విద్యార్థులకు ఆనందం కలిగించినా.. ల్యాబ్ ల్లో ప్రయోగ నైపుణ్య అనుభవాలు లేక అంతిమంగా నష్టమే కలుగుతుంది. ఇకపై ఇలాంటి అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు ముందుకు వచ్చింది.

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలు బిగించారు. వాటిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నారు. దీనికోసం రాష్ట్ర బోర్డు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.

టెండర్ల ఆహ్వానం

రాష్ట్రంలో 2,500కు పైగా ఇంటర్మీడియెట్ కాలేజీలు ఉన్నాయి. వచ్చేనెల ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా, ప్రాక్టికల్స్ నిర్వహణపై అనేక విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టానుసారంగా మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో ప్రాక్టికల్స్ నిర్వహించే అన్ని కాలేజీల్లోని ల్యాబ్ ల్లోనూ సీసీ కెమెరాలు బిగించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే సర్కారు, ప్రైవేటు కాలేజీలకు ఈ దిశగా ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఆయా కళాశాలలన్నింటితో బోర్డుకు కనెక్టివిటీ ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సెక్రెటరీ కృష్ణ ఆదిత్య నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే ప్రక్రియ పూర్తి చేసి, వచ్చేనెలలో జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను నేరుగా పర్యవేక్షించనున్నారు.