నిజామాబాద్ సిటీ, అక్షరటుడే: రైలు పట్టాలపై ఒకరు ఆత్మహత్యకు యత్నించగా రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయిరెడ్డి కథనం ప్రకారం.. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ పట్టాలపై ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడని అతని భార్య 100 కాల్ చేసింది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి వెంటనే రైల్వే స్టేషన్ లో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు, కానిస్టేబుల్ రాములును అలర్ట్ చేశారు. వారు ప్లాట్ ఫాం-3 వద్ద పరిశీలించగా ఒక వ్యక్తి పట్టాలపై కూర్చొని ఉన్నాడు. వెంటనే అతనిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. విచారించగా.. అతను హోంగార్డు అని తెలిసింది. కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఇలా చేసినట్లు తెలిపాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.