అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్ని ఓటర్లను ఆకట్టుకునే హామీలను ఇస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ‘మధ్యతరగతి మేనిఫెస్టో’ ను విడుదల చేసింది. బుధవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మేనిఫెస్టోను ప్రకటించారు. మధ్య తరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఆప్‌ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్‌ డిమాండ్లను చేర్చారు. మధ్యతరగతి ప్రజలు అధికంగా పన్నులు చెల్లిస్తున్నారని.. తక్కువ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

ఆప్‌ ప్రవేశపెట్టనున్న ఏడు డిమాండ్లు

  • విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను 2శాతం నుంచి 10 శాతానికి పెంచడం. ప్రైవేట్‌ పాఠశాలలో ఫీజుల నియంత్రణ
  • మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలు
  • ఆరోగ్య బడ్జెట్‌ను 10శాతానికి పెంచడం. ఆరోగ్యబీమాపై పన్ను ఎత్తివేయడం
  • ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 7లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
  • నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు
  • సీనియర్‌ సిటిజన్స్‌ కోసం మరింత మెరుగైన పింఛన్‌ పథకాలు ప్రవేశపెట్టడం
  • రైల్వేలో సీనియర్‌ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలి.