అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందునే ఆ పార్టీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం “వేల గొంతులు- లక్ష డప్పుల” సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7న హైదరాబాద్​లో నిర్వహించే “వేల గొంతులు- లక్ష డప్పుల” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చినా.. ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. అందరికంటే ముందుగా తెలంగాణలోనే వర్గీకరణను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సీఎం కాకముందు నాలుగుసార్లు మాదిగల నిరసనలకు, సభకు మద్దతు తెలిపి, సీఎం అయ్యాక మాట తప్పారన్నారు. మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందన్నారు. దళితుల్లో 59 కులాలు ఉంటే కేవలం మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన దీక్షకు మొదటి నుంచి అండగా నిలబడ్డానన్నారు. కానీ దళిత సీఎం మాట తప్పడంతో వ్యతిరేకించానన్నారు. దీంతో జైలుకు కూడా వెళ్లే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. వర్గీకరణ పోరాటంలో ప్రధాని మోదీ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. 30 ఏళ్లలో ఎన్నో అవకాశాలు వచ్చాయని.. అయినా కండువా మార్చలేదన్నారు. భవిష్యత్తులోనూ కండువా మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి, ఎంఎస్​పీ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, గంగారాం, బాలు తదితరులు పాల్గొన్నారు.

సభ మధ్యలో కేంద్రం నుంచి ఫోన్..

మందకృష్ణ మాదిగ సభలో ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో కేంద్ర ప్రతినిధుల నుంచి పద్మశ్రీ ప్రకటించినట్లు ఫోన్ వచ్చింది. దీంతో సభా ప్రాంగణంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.