అక్షరటుడే, ఇందూరు: గంజాయి, క్లోరోఫామ్, అల్ప్రాజోలం తదితర మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, భూపతిరెడ్డి హాజరై చర్చించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున నిఘా పెంచాలని ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్​తో ప్రత్యేకంగా సమావేశమై అడిక్షన్ సెంటర్ ఏర్పాటు గురించి చర్చించారు. సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ సహాయ సూపరింటెండెంట్​ డీసీబీ నాయక్, డీఎంహెచ్​వో రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ తదితరులు పాల్గొన్నారు.