అక్షరటుడే, బాన్సువాడ: మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. ఆ పార్టీ నాయకులకు గ్రామాల్లో తిరిగి ఓటు అడిగే హక్కులేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపేట్‌, తాడ్కోల్‌ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజులు గడిచినా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఒకవేళ అమలు చేసి ఉంటే తానే కాంగ్రెస్‌కి ఓటు వేసేవాడినని పేర్కొన్నారు. వరికి రూ.500 బోనస్‌ ఇచ్చారా..? ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని వివరించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో నియోజకవర్గంలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లకు దొంగ బిల్లులు లేపారని గుర్తు చేశారు. మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి ఇంటికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు.. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శ్రవణ్‌, ఎంపీటీసీ రమణ, నాయకులు విఠల్‌, గురు వినయ్‌, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీధర్‌, రవీందర్‌, ప్రశాంత్‌, రత్నాకర్‌, హన్మాండ్లు, నరహరి పాల్గొన్నారు.