అక్షరటుడే, ఇందూరు: చెరుకు ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి కార్యాచరణ మొదలుపెట్టినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెరుకు ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి కమిటీ వేశారన్నారు. కమిటీ పరిశీలన తర్వాత అవగాహనకు వచ్చామని, 2025 డిసెంబర్ నాటికి క్రషింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. జగిత్యాలలో ప్రత్యేకించి ఎవరి గురించి మాట్లాడలేనన్నారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు సపోర్టు ఇచ్చాననడం తగదన్నారు. నిజామాబాద్‌ని స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమన్నారు. మహిళా డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ పూర్తయితే ఎన్నో లాభాలు ఉంటాయని.. తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో ఈ అంశాపై ప్రస్తావిస్తానన్నారు. ఉగ్రవాదులు, ఖలిస్థాన్ సంస్థలను తమ ప్రభుత్వమే మట్టుపెట్టిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నామని, ఆ తర్వాతే మైనారిటీలకు అని పేర్కొన్నారు. గతంలో రాజకీయాలతీతంగా అరవింద్‌ను గెలిపించాలని అనడం వెనక అప్పుడున్న సందర్భం ఆధారంగా.. కవిత మీదున్న ద్వేషంతో అన్నానన్నారు. ఎమ్మెల్సీగా తాను ప్రశ్నించే గొంతుగా ఉన్నానని, నిజామాబాద్‌కు కూడా తన వంతు సహకారం అందించానని తెలిపారు. మండవ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి టికెట్ ఆశించారు కానీ నిజామాబాద్‌లో తనకు ఎంతో సహకరిస్తున్నారని, ప్రచారంలోనూ తోడుంటున్నారని చెప్పారు. తన కుటుంబానికి పదవులు ఇచ్చారని ప్రత్యర్థులు చెప్పడం సిగ్గుచేటని, తాను కనీసం కౌన్సిలర్ పోటీకి కూడా తన కుటుంబ అభ్యర్థిని పెట్టలేదని చెప్పారు.