అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ అర్బన్ రిజిష్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము అడిగినంత ఇస్తేనే..రిజిస్ట్రేషన్లు చేసి పెడుతున్నారు. లేకపోతే లేనిపోని కొర్రీలతో డాక్యుమెంట్లను వెనక్కి పంపుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ.. ఏదో ఒక సాకుతో డాక్యుమెంట్లు చేయకుండా తిప్పించుకుంటున్నారు. ఇలా రోజుకు రూ.లక్ష వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది.
ఆది నుంచి వివాదాస్పదమే..
నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొత్తగా బదిలీపై వచ్చిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదమే. గతంలో వీరు ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు నిర్ణయించగా పలువురు డబ్బులు ఇవ్వకపోవడంతో డాక్యుమెంట్లు నిలిపివేశారు. మరోవైపు పార్ట్లీ(ప్లాటును విభజించి అమ్మడం) డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొద్దిరోజుల పాటు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ల వైఖరి మారలేదు.
ముందుగా ఇస్తేనే..
ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల కోసం పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇదివరకు రిజిస్ట్రేషన్ జరిగిన నాన్ లేఅవుట్ డాక్యుమెంట్ లావాదేవీలు జరిపేందుకు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పార్ట్లీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఒకప్పుడు కొర్రీలు పెట్టిన అధికారులే.. ఇప్పుడు ఒక్కో డాక్యుమెంట్ కోసం రూ.10 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఇలా నిత్యం రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. వీరి బలవంతపు వసూళ్లపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి తాజాగా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.