అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతోపాటు విద్యార్థుల నమోదు, హాజరులో అక్రమాలకు పాల్పడుతున్నారు. కేంద్రాలకు విద్యార్థులు సక్రమంగా హాజరు కాకున్నా.. టీచర్లు వందశాతం హాజరైనట్లు నమోదు చేస్తున్నారు. సోమవారం వెలగనూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా, ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరు కాగా, టీచర్ సైతం కేంద్రంలో లేరు. మంగుళూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా, ఉదయం 11.30 గంటలైనా తాళాలు తెరవలేదు. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కొందరు టీచర్ల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అంగన్వాడీలపై పర్యవేక్షణ చేయాలని, టీచర్లు సకాలంలో కేంద్రాలు తెరిచేలా చూడాలని పలువురు కోరుతున్నారు.