అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. దీంతో చిన్నారులను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మున్సిపల్ పరిధిలో బుధవారం ఒకే రోజు ఆరుగురిపై శునకాలు దాడి చేశాయి. పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ ఆలయం ప్రాంతంలో హన్సిక అనే చిన్నారి ఆడుకుంటుండగా కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడింది. మరో కాలనీలో గంగామోహన్ అనే వ్యక్తితో పాటు జాబేరు హుస్సేన్, హంసిని, గుజరాతి వివన్స్తో పాటు మరొకరిపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నామమాత్రంగా చర్యలు
ఆర్మూర్ పట్టణంలో గతంలోనూ కుక్కలు ప్రజలపై దాడులు చేశాయి. దీంతో అధికారులు ఒకటి, రెండు కాలనీల్లో కుక్కలను పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి తిరిగి అదే కాలనీల్లో వదిలేసి చేతులు దులుపుకున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రతి కాలనీలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. అవి దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి శునకాల బెడద నియంత్రించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.