అక్షరటుడే, కామారెడ్డి: ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో 8 మందికి గాయాలైన ఘటన కామారెడ్డి శివారులోని టేక్రియాల్ బైపాస్​ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ డిపో‌‌–1కు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు కామారెడ్డికి 15 మంది ప్రయాణికులతో వస్తోంది. టేక్రియాల్ బ్రిడ్జి కింద రోడ్డు పనులు జరుగుతుండడంతో బైపాస్ బ్రిడ్జి పైనుంచి బస్సు వచ్చి వంతెన ఎండింగ్ వద్ద కామారెడ్డి వైపు యూటర్న్ తీసుకుంటుండగా నిజామాబాద్ నుంచి వస్తున్న లారీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు మధ్య భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ రాములుతో సహా 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాలుడు అర్జున్, స్వప్న, విఠల్, దీప్తి, వీరవ్వ, విజయ, ఉమారాణి, డ్రైవర్ రాములు ఉన్నారు. ఇందులో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.