అక్షరటుడే, వెబ్డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట పెట్టుబడులపై 11 నుంచి 22శాతం రిటర్న్ ఇస్తామని ఈ కంపెనీ ప్రజలను నమ్మించింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 6900 మంది రూ.1700 కోట్లు డిపాజిట్ చేశారు. ఇందులో రూ.850 కోట్లను డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన కంపెనీ మిగతా నిధులను దుర్వినియోగం చేసింది. ఆ డబ్బులను ఇతర దేశాలకు తరలించారు. ఢిల్లీకి చెందిన పలువురి బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరగడంతో ఈడీ తాజాగా కేసు నమోదు చేసింది. డబ్బులను 22 డొల్ల కంపెనీలకు తరలించినట్లు గుర్తించింది.
ప్రధాన నిందితులు దుబాయిలో..
ఫాల్కన్ స్కాంలో సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ ఛైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య, మేనేజర్ అనంతను గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితులు ఫాల్కన్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయి పారిపోయారు.