అక్షరటుడే, కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, దీంతో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచాలని చూస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆరోపించారు. కామారెడ్డి లింగాపూర్​ వద్ద గల బృందావన్​ గార్డెన్​లో శనివారం పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకక కాంగ్రెస్​ రోడ్డున వెళ్లే వారిని పట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఆయనకు సొంత ఎమ్మెల్యేల నుంచే మద్దతు కరువైందన్నారు. కేసీఆర్ ముఖం చూసి ఎవరూ ఓటేయరని టికెట్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు.

మేము కొట్లాడితే కాంగ్రెస్​ను గెలిపించారు

బీఆర్​ఎస్​ హయాంలో ప్రజా సమస్యలపై తాము పోరాటాలు చేస్తే ప్రజలు కాంగ్రెస్​ను గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రౌడీ షీట్లు పెట్టారని, జైలుకు పోయామని గుర్తు చేశారు. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చానని, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నా.. తనపై ఇప్పటికి 109 కేసులు ఉన్నాయని బండి సంజయ్​ అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించాలని కోరారు.

ఎల్ఆర్ఎస్ పేరు​తో దోచుకునే యత్నం

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. కులగణన పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తోందన్నారు. రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ చెల్లించలేక ఉద్యోగుల విరమణ వయసు పెంచాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్సీ ఇన్​ఛార్జీలు గంగారెడ్డి, హైమారెడ్డి పాల్గొన్నారు.