అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహోద్యోగులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కాగా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఒత్తిడి వల్లే చంద్రశేఖర్ కు ఈ పరిస్థితి తలెత్తినట్లు కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది.
సబ్ రిజిస్ట్రార్ల డుమ్మా..
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. శనివారం ఇద్దరు కూడా ఉన్నఫలంగా సెలవు పెట్టారు. దీంతో చంద్ర శేఖర్ కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు అధికారులు చేయాల్సిన పనిని మిడిమిడి అవగాహన ఉన్న సీనియర్ అసిస్టెంట్ కు కట్టబెట్టడంతో ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లు ఎక్కువగా రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు నిలదీయడంతో సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే అక్కడ వాలిపోయారు. ఇంతలోనే సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. తదనంతరం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా.. న్యూరో సంబంధిత సమస్యతో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
అవినీతి ఆరోపణలెన్నో..
గత కొద్ది రోజులుగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీకెండ్ వరకు డాక్యుమెంట్ల రూపంలో పెద్దఎత్తున వసూళ్లు చేసి.. తీరా వీకెండ్ సమయంలో ఇద్దరు అధికారులు సెలవు పెట్టి వెళ్తున్నారు. ఒకవిధంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయనే భయంతో విధులకు డుమ్మా కొడుతున్నారని ప్రచారంలో ఉంది. కాగా.. తాజా వ్యవహారం నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!