అక్షరటుడే, వెబ్‌డెస్క్: అక్షర కిరణం అస్తమయమైంది.. మేరు పర్వతం దివికేగింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. రైతుబిడ్డగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1974లో విశాఖ సాగర తీరంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. నాలుగేళ్లలోనే ప్రజల మన్ననలు దక్కించుకుని.. ఈనాడు సంస్థ అంచెలంచెలుగా ఎదిగేందుకు అహర్నిశలు శ్రమించారు. ప్రింట్ మీడియాతో పాటు డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిపి పత్రికా రంగంపై చెరగని ముద్ర వేసి మీడియా మొగల్‌గా పేరుగాంచారు. ఆయన స్థాపించిన రామోజీ ఫిలింసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచింది. ప్రియా పికిల్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇలా ఎన్నో సంస్థలను స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించి వ్యాపారవేత్తగా రాణించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన చేసిన ఎనలేని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహనీయుడు
సాధారణ కుటుంబంలో జన్మించి.. వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. విలువలు, నిరంతర శ్రమనే నమ్ముకుని చివరి క్షణం వరకు జీవించి.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించి అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకుని.. ‘మరణం.. ఒక వరం..’, ‘నాకు చావు భయం లేదు’ అని చేతల్లో చూపించారు.