అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన ఐపీఎస్ అధికారిణి రోహిణీ ప్రియదర్శిని డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై రాబోతుండగా.. సీపీ ట్రాన్స్‌ఫర్ వార్తలకు చెక్ పడింది. నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ బదిలీపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఆయన బదిలీ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్మేశ్వర్‌ను ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో సోమవారం వెలువడిన 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జాబితాలో సీపీ కల్మేశ్వర్ పేరు లేదు. త్వరలో మరి కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ కాబోతున్నారు. కానీ.. ఆ జాబితాలో కూడా సీపీ కల్మేశ్వర్ పేరు ఉండదని తెలుస్తోంది. ఆయన సతీమణి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా వస్తున్నారు. సిటీలో కీలకమైన నార్త్ జోన్ డీసీపీ పోస్టును వదులుకొని ఆమె కమాండెంట్‌గా రావడం చర్చకు దారితీసింది. దీంతో ఇప్పట్లో సీపీ కల్మేశ్వర్ బదిలీ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్మేశ్వర్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పోలీస్ బాస్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల ఏమాత్రం సహించట్లేదు. ఇప్పటికే పలువురు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. శాంతి భద్రతల విధుల్లోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం చేసిన ఏసీపీలకు సైతం ఆయన మెమోలు జారీ చేశారు. పొలిటికల్ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గట్లేదు. అతి తక్కువ సమయంలోనే తన మార్క్ చూపించారు.