అక్షరటుడే, వెబ్‌డెస్క్: చైనా మాంజా ఒకరి ఉసురు తీసింది. హరిద్వార్ లో భారతీయ రైల్వేకు చెందిన జూనియర్ ఇంజనీర్ మాంజా వల్ల జరిగిన ప్రమాదంలో మరణించారు. సులేఖ్ చంద్(58) తన భార్య అరుణా దేవితో కలిసి ఎయిమ్స్ రిషికేశ్ నుంచి బైక్ పై తిరిగి వస్తుండగా.. గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం సమీపంలో విచ్చలవిడిగా వదిలేసిన చైనా మాంజాలో చిక్కుకుని అదుపు తప్పి పడిపోయారు. స్థానికులు అతన్ని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అతను మరణించినట్లు తెలిపారు. తన భార్య అరుణా దేవికి సైతం గాయాలయ్యాయి. కంఖాల్ SHO మనోజ్ నౌటియాల్ మాట్లాడుతూ.. “బైక్ జారిపోవడంతో బాధితుడి తలకు గాయమైంది.” అని చెప్పారు.
చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ విపరీతంగా సరఫరా కావడం వల్ల హరిద్వార్‌లోని చెట్లు, రోడ్లు, విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతక దారం ఇరుక్కుపోయింది. దీనివల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఆదివారం ఒక్క రోజే, మాంజా సంఘటనల కారణంగా నగరంలో 50 మందికి పైగా గాయపడ్డారు.