అక్షరటుడే, వెబ్‌డెస్క్: కర్నాటకలోని బెలగావిలో భాషా వివాదం చోటు చేసుకుంది. బెలగావి సరిహద్దులో మరాఠీలో మాట్లాడలేదంటూ కర్నాటకకు చెందిన బస్ డ్రైవర్, కండక్టర్‌పై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు చిత్రదుర్గలో మహారాష్ట్ర బస్సుపై కన్నడ సంఘాలు దాడి చేశాయి. డ్రైవర్‌కు మసిపూసి, బస్సుకు పెయింట్ వేసి నిరసన తెలిపిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
అసలు వివాదం ఏమిటంటే..
బెల్గాం ప్రాంతం స్వాతంత్ర్యానికి పూర్వం బొంబాయి రాష్ట్రంలో ఉండేది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో దానిని కర్నాటకలో కలిపారు. కర్నాటక ప్రభుత్వ బెల్గాం పేరును బెలగావిగా మార్చింది. అప్పటి నుంచి ఆ భూభాగం తమకే కావాలని మహారాష్ట్ర కోరుతోంది. బెలగావిని తిరిగి ఇవ్వడానికి కర్నాటక ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతం కోసం ఇరురాష్ట్రాల మధ్య ఏళ్లుగా వివాదం నెలకొని ఉంది. ఈ క్రమంలో తరుచు ఆందోళనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.