అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో కొందరు అధికారుల తీరుపై అంసతృప్తితో ఉంది. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్లతో పలువురు అధికారులు కుమ్మకై ఇష్టారాజ్యంగా దస్తావేజులు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయమై అధికారులను హెచ్చరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అయినా పలు కార్యాలయాల్లో ఏమాత్రం పరిస్థితి మారట్లేదు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ డాక్యుమెంట్ రైటర్(ప్రైవేటు వ్యక్తి) కార్యాలయంలో పనులు చేయడం చర్చకు దారితీసింది. సిబ్బంది విధులు నిర్వర్తించే క్యాబిన్‌లో గురువారం ఉదయం సదరు డాక్యుమెంట్ రైటర్ ఎంచక్కా కంప్యూటర్‌లో పనులు చక్కబెడుతూ కనిపించారు. ఒకవైపు తాము ఎలాంటి అవినీతి చేయట్లేదని, అంతా పక్కాగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న అర్బన్ కార్యాలయం అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. మరోవైపు ఈ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరుగుతున్న అక్రమ వసూళ్లపై డీఐజీ రమేశ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఆర్ ను ఆదేశించారు. కాగా.. డీఐజీ, డీఆర్ అన్నీ తానై ఉన్న అధికారి ఇలా.. మొక్కుబడిగా మెమో జారీ చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.