అక్షరటుడే, కామారెడ్డి: జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ వాహనాన్ని బైకు ఢీకొన్న ఘటనలో తండ్రితో పాటు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నాచారంలో నివాసం ఉండే ఊసిల దయాకర్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు గురువారం అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో బైకుపై బయలుదేరారు. జంగంపల్లి శివారుకు చేరుకోగా.. అక్కడ ఆగి ఉన్న మేకల వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దయాకర్ తో పాటు ఐదేళ్ల కృతిక్, 15 ఏళ్ల వియాంచ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని కామారెడ్డికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దయాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.