మెదక్, అక్షరటుడే: వారం రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉండిపోయాడు ఓ వ్యక్తి. శుక్రవారం ఉదయం అండర్ డ్రైనేజీ నుంచి శబ్దాలు రావడం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన నాగారం మల్లేష్ గత కొద్దిరోజులుగా కనిపించటం లేదు. అతని కోసం అంతటా వెతికిన కుటుంబ సభ్యులు చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లేష్ కనపడటం లేదని, పోస్టర్లు అతికించి, వివిధ వాట్సాప్ గ్రూప్లలో అతని ఫొటోను షేర్ చేశారు. అందువల్లే ఇతన్ని బయటకు తీసిన తర్వాత ఎవరు అనే విషయన్ని తొందరగా గుర్తించగలిగారు.

మల్లేష్ వారం రోజుల క్రితం కుంభమేళాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో నర్సాపూర్ కు చేరుకున్నానంటూ కుటుంబీకులకు సమాచారం అందించి.. అదృశ్యమయ్యాడు. కాగా అప్పటి నుంచి వారం రోజులుగా కుటుంబీకులు మల్లేష్ కోసం వెతక సాగారు. శుక్రవారం నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అండర్ డ్రైనేజీ పైన గల సిమెంట్ పలకల మధ్యలో నుంచి చేతులు బయటకు పెట్టడంతో, గుర్తించిన స్థానికులు సురక్షితంగా బయటకు తీసి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. తాను కుంభమేళా నుంచి వచ్చానని, తనను ఎవరో వెంబడించారని.. అండర్ డ్రైనేజీలోకి తానే వెళ్ళానని మల్లేష్ అంటున్నాడు. వారం రోజులు తిండి, నీళ్లు లేకుండా డ్రైనేజీలో ఉన్న మల్లేష్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.