అక్షరటుడే, హైదరాబాద్‌: ప్రేమించిన ప్రియురాలి కోసం ఏకంగా రూ.3 కోట్లతో పెద్ద ఇల్లునే కట్టించాడు ఓ దొంగ. దోచుకున్న డబ్బుతో ఇలా చేశాడు. సదరు నిందితుడు పంచాక్షరి స్వామి(37) ప్రస్తుతం బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడికి ఓ ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్వామి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. తండ్రి మరణం తర్వాత, అతని తల్లికి రైల్వేలో ఉద్యోగం లభించింది.

బాల్యం నుంచే చోరీలు..

మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచాక్షర స్వామి మైనర్ గా ఉన్నప్పటి నుంచే(2003) దొంగతనాలు చేసేవాడు. ఇలా రూ.కోట్ల విలువైన సంపదని కూడబెట్టాడు. స్వామికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయినా 2014 -15లో ఒక ప్రముఖ నటితో పరిచయం ప్రేమగా మారింది. ఆమెకు కోల్ కతాలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు కట్టించి, రూ.22 లక్షల విలువైన అక్వేరియంని బహుమతిగా ఇచ్చాడు.

జైలు శిక్ష పడినా మారని తీరు..

2016లో స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అహ్మదాబాద్ లోని సబర్మతి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక.. తిరిగి దొంగతనాలు ప్రారంభించాడు. పలు నేరాల కింద మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2024లో విడుదలయ్యాక, తన మకాంను బెంగళూరుకు మార్చాడు. అక్కడే ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

జనవరి 9న బెంగళూరులోని మడివాలా ప్రాంతంలో చేసిన దొంగతనం ఆధారంగా స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తాను చేసిన నేరాలను అంగీకరించాడు. నిందితుడి నుంచి పోలీసులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.