అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: కన్న కొడుకును హతమార్చిన ఓ తల్లికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని నాగారం సంతోష్‌నగర్‌లో నివాసముండే భార్యభర్తలు భరత్‌, లావణ్యకు ఇద్దరు కుమారులున్నారు. తొమ్మిది నెలల వయసులో చిన్నకొడుకు రణదీప్‌ మృతి చెందాడు. అయితే కల్లుకు బానిస అయిన లావణ్య నిత్యం భర్తతో గొడవపడేది. ఈ క్రమంలో తనకు భారంగా మారిన కుమారుడిపై కసి పెంచుకుంది. 2023 మార్చి 29న మాక్లూర్‌ మండలం దాస్‌నగర్‌ వద్ద నిజాంసాగర్‌ కెనాల్‌ వద్దకు కొడుకును తీసుకెళ్లి నీటిలో ముంచి హత్య చేసింది. నేరం రుజువు కావడంతో లావణ్యకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి శ్రీనివాస్‌ తీర్పునిచ్చారు.