అక్షరటుడే, వెబ్‌డెస్క్: మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ‘ఎక్స్’ వేదికగా అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో షేర్ చేశారు. ‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సహాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అని పేర్కొన్నారు.