అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ రానుంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. బీసీ కమిషన్ పర్యటనను పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న నిజామాబాద్ కలెక్టరేట్‌లో కమిషన్ అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిజామాబాద్ జిల్లా వారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కామారెడ్డి జిల్లా వారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను కమిషన్‌కు నివేదించవచ్చని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు తెలిపారు. సన్నాహక సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి స్రవంతి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ పాల్గొన్నారు.