అక్షరటుడే, నిజాంసాగర్​: రైతులు డ్రోన్​ను ఉపయోగించుకుని వ్యవసాయం చేస్తే ఖర్చులు, సమయం ఆదా అవుతుందని వ్యవసాయ శాఖ అధికారి అమర్​ ప్రసాద్​ పేర్కొన్నారు. మంగళవారం నిజాంసాగర్​ మండలంలోని గోర్గల్​ గ్రామంలో వరిపంటను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరిలో మొగి పురుగు ఉధృతి, జింక్ పోషక లోపం అధికంగా ఉందన్నారు. జింక్​ పోషక లోపం నివారణకు జింక్ సల్ఫేట్ మందు ఎకరానికి 400 గ్రాములు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మొగి పురుగు నివారణకు వరి నాటిన 30 రోజుల వరకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లొరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు ఎకరానికి 4 కిలోలు చల్లుకోవాలని సూచించారు. ఈ సందర్శనలో మండల వ్యవసాయాధికారి, నాయకులు దుర్గారెడ్డి, రైతులు కాశా గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.