అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని మూడోటౌన్‌ పరిధిలో గల రామాలయం వద్ద ఓ దొంగ చైన్‌ కొట్టేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. సుభాష్‌నగర్‌కు చెందిన సీహెచ్‌ పుష్ప, ఆమె మనమరాలు తరుణి ఇద్దరు గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో స్థానిక రామాలయానికి వెళ్లారు. గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి బండి ఎక్కి వెళ్తుండగా.. నడుస్తూ వచ్చిన దొంగ కింద ఏదో పడిందని వారికి చెప్పాడు. వెంటనే పుష్ప వెనక్కి తిరిగి చూసింది. దీంతో దొంగ ఆమె మెడలో నుంచి చైన్‌ను లాక్కుని పరిగెత్తాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.