అక్షరటుడే, ఆర్మూర్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం లక్కోరలో బుధవారం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేసిన వేముల ప్రశాంత్‌రెడ్డి సాగు నీటి విషయంలో అదనంగా చేసిందేమీ లేదన్నారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ఏమైందో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలు బాగుండాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, నేతలు ఈరవత్రి అనిల్ కుమార్, అన్వేష్ రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, మండవ వెంకటేశ్వరరావు, అరికెల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, మానాల మోహన్‌రెడ్డి, సునీల్ రెడ్డి, వినయ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.