అక్షరటుడే, వెబ్ డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(75) మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి.శ్రీనివాస్ 1989, 99, 2004 లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిసింది.